హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు భాషనీ, సంస్కృతిని దురుద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేయడంతో 20వ శతాబ్దం ప్రారంభంలో ఒక సామాజిక సాంస్కృతిక చేతన తలెత్తింది. 1901లో కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే లైబ్రరీ స్థాపించారు. 1906లో సైన్స్, సాహిత్యంలో పుస్తకాలు ప్రచురించేందుకు విజ్ఞాన చంద్రికా మండలి అనే సంస్థని స్థాపించారు. నీలగిరి పత్రిక, గోల్కొండ పత్రిక, తెలుగు పత్రిక, నవశక్తి, నిజాం విజయ్ వంటి అనేక ఇతర పత్రికలు కూడా అప్పటి ప్రజల సాహిత్యావసరాలు తీర్చేందుకు ప్రచురణలోకి వచ్చాయి.
నిజాం పాలనలో నిర్లక్ష్యానికి గురైంది విద్యా రంగం. 1946లో హైదరాబాద్ మొత్తంలో కొన్ని స్కూళ్ళు మాత్రమే ఉండేవి. విద్యా వ్యాప్తి చేసేందుకు ప్రభుత్వం ఏ మాత్రం ఆసక్తి చూపకపోవడంతో విద్యావేత్తలు, సామాజిక సంస్కర్తలు ఆ బాధ్యత తీసుకోవలసి వచ్చింది. 1906లో కేశవ్ రావు కోరట్ కర్, వామన్ నాయక్ వివేకా వర్ధని పాఠశాల నెలకొల్పారు. 1907లో గుల్బర్గాలో నూతన్ విద్యాలయ హై స్కూల్ ఏర్పాటైంది. పండిట్ తారనాథ్ రాయచూరు లో హందర్ద్ హైస్కూల్ ఏర్పాటు చేయగా, హైదరాబాద్ లో మాడపాటి హనుమంత రావు, నిజాం ఆదేశాలను ఉల్లంఘించి, తెలుగు మాధ్యమంగా బాలికల పాఠశాల నెలకొల్పారు.
తెలుగు భాష, సంస్కృతిని పెంపొందించేందుకు అనేకమంది మేధావులు కలిసి 1922లో ఆంధ్ర జన సంఘం ఏర్పాటు చేశారు. ఆంధ్ర కేంద్ర జన సంఘం పేరిట ఏర్పాటైన ఒక కేంద్ర సంఘం అనేక పుస్తకాలు ప్రచురించి, మహిళా విద్యను ప్రోత్సహించింది. 1930 నాటికి అనేక పట్టణాల్లో ఆంధ్ర మహా సభ అనే ఒక పెద్ద సంస్థను స్థాపించారు. హైదరాబాద్ ప్రాంతంలో సామాజిక సాంస్కృతిక జాగృతి కలిగించడంలో ఆంధ్ర మహాసభ కీలక పాత్ర పోషించింది. మహాసభ తొలి సదస్సు సురవరం ప్రతాప రెడ్డి అధ్యక్షతన మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. రెండో సదస్సుకి బూర్గుల రామకృష్ణ రావు అధ్యక్షత వహించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ, గ్రంథాలయ ఉద్యమంలో కూడా ఆయన ముఖ్యమైన భూమిక నిర్వహించారు.
ఆంద్ర మహా సభకి వచ్చిన ప్రజాదరణ చూసి, మహారాష్ట్ర పరిషత్, కర్ణాటక పరిషత్ కూడా ఏర్పాటు చేసే ప్రేరణ లభించింది. 1940 నాటి నుంచి మహాసభ రెండో దశ ప్రారంభమైంది. కమ్యూనిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు క్రమంగా సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల నుంచి, ఆర్ధిక రాజకీయ కార్యక్రమాలకి మారాయి.
ఆంధ్ర మహాసభ కార్యకలాపాల వల్ల తెలంగాణా మొత్తంలో, సుదూర గ్రామాలలో కూడా, లైబ్రరీలు, సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు జరిగింది. కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలు, గాంధీ, నెహ్రు వంటి స్వాతంత్ర్య సమర యోధులు రచించిన పుస్తకాలను కార్మిక వర్గానికి చెందిన సామాన్య ప్రజలు కూడా చదివేవారు. సమకాలీన సమస్యలు, సాంస్కృతిక అంశాల గురించి మహాసభ తెలుగులో కూడా అనేక పుస్తకాలు ప్రచురించింది.
హైదరాబాద్ విస్తీర్ణం 2,14,000 చదరపు కిలోమీటర్లు, ఇది దాదాపుగా యునైటెడ్ కింగ్డమ్ భూ విస్తీర్ణంతో సమానం. 1941 లో హైదరాబాద్ జనాభా కోటీ 60 లక్షలు. తెలంగాణలో 8 జిల్లాలు, మరాఠ్వాడాలో 5 జిల్లాలు, కర్ణాటక లో మూడు జిల్లాలతో హైదరాబాద్ ఒక సమగ్ర రాష్ట్రం. జనాభాలో 50 శాతం మంది తెలుగు, 27 శాతం మంది మరాఠీ, 13 శాతం మంది కన్నడ మాట్లాడేవారని, కేవలం 10 శాతం మంది మాత్రమే ఉర్దూ భాష మాట్లాడేవారని 1941 జనాభా లెక్కలు తెలియచేశాయి. అయితే, ఉర్దూకి రాజప్రాపకం లభించి, ముస్లింలు ఉర్దూ మాత్రమే వాడడంతో, జనాభాలో తక్కువ శాతం ఉన్నప్పటికీ వారు పరిపాలనా, పోలీస్ వ్యవస్థలలో అసమానమైన స్థాయిలో పలుకుబడి కలిగి ఉండేవారు.