వీడియోను దాటవేయి

జాతీయవాద ఉద్యమానికి ప్రతిస్పందన

ఇదిలా ఉండగా, 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన హైదరాబాద్ ప్రాంతoపైన ప్రభావం చూపింది. మౌలానా అబ్దుల్ ఖయ్యూమ్, రామచంద్ర పిళ్ళై, అఘోరనాథ్ చటోపాధ్యాయ వంటి మేధావులు కాంగ్రెస్ ఏర్పాటుని స్వాగతించారు. 1900 శతాబ్దం ప్రారంభంలో స్వదేశీ, విదేశీ బహిష్కరణ ఉద్యమాలతో ఆర్య సమాజ్ నాయకత్వ పాత్రలోకి వచ్చింది. మరాఠ్వాడా జిల్లాలో ఈ ఉద్యమాలను మరింత బలోపేతం చేయడం కోసం లోకమాన్య తిలక్ విస్తృతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించేవారు. లోకమాన్య తిలక్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపినందుకు అప్పటి నాసిక్ జిల్లా కలెక్టర్ జాక్సన్ ని కాల్చి చంపారు.

i. ఆర్య సమాజం యొక్క కార్యకలాపాలు

నిజాం పాలనలో మతపరమైన పీడన ఎదుర్కొన్న హిందూ అధిక సంఖ్యాక వర్గం వారి హక్కులు కాపాడడంపైనా ఆర్య సమాజ్ దృష్టి సారిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ పౌర హక్కులు, స్వాతంత్య్రం అనే స్థూల లక్ష్యం పైన దృష్టి కేంద్రీకరించింది. కమ్యూనిస్టులు మరో పక్క భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థపైనా, దోపిడీ పైనా పోరాటం జరిపారు.

1892లో స్వామీ నిత్యానంద సరస్వతి హైదరాబాద్ లో ఆర్య సమాజ్ కార్యకలాపాలను ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలోని హిందువులను ఈ సంస్థ ఆకర్షించింది. 1895లోనే ఆర్య సమాజ్ గణేష్ ఉత్సవం నిర్వహించింది. హిందూ సమాజం రక్షణ కోసం పోరాడిన ఆర్య సమాజ్, శుద్ధి మతమార్పిడి కార్యక్రమాల ద్వారా నిష్క్రియాత్మకమైన నిరసన పద్ధతిని ఎంచుకుంది.

నిజం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఆర్య సమాజ్ పాత్ర పెరగడంతో ఆగ్రహించిన నిజాం ప్రభుత్వం, ఆర్య సమాజ్ నాన్ ముల్కీ, అంటే స్థానికేతరమనీ, ముస్లిం వ్యతిరేకమని పేరు పెట్టింది. ఆర్య సమాజ్ ని అణచివేసేందుకు భారీగా ప్రయత్నం జరగడంతో, ఆర్య సమాజ్ 1938లో సత్యాగ్రహంతో స్పందించింది. సత్యాగ్రహీలకు హిందూ మహాసభ, RSS శ్రేణులు మద్దతు ఇచ్చాయి. సత్యగ్రహీలు జైల్లో కూడా తమ నిరసన కొనసాగించారు. వారిలో ప్రముఖులు వందేమాతరం రామచంద్ర రావు. వందేమాతరం ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి ప్రతిగా విశ్వవిద్యాలయం వందలాది మంది విద్యార్థులను బహిష్కరించింది. వారు ఆ తర్వాత నాగ్ పూర్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందారు. వందేమాతరం ఉద్యమంలో చేరిన ప్రముఖ విద్యార్థుల్లో తర్వాత భారత ప్రధానమంత్రి అయిన శ్రీ P.V. నరసింహారావు కూడా ఒకరు. ఆర్య సమాజ్ నిజాం దళాలను ఎదిరించేందుకు ఉస్మానాబాద్ సోలాపూర్ అమరావతి పండరిపూర్ మొదలైన చోట్ల సరిహద్దు క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది.

ii. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పాత్ర

హైదరాబాద్ పోరాటంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కూడా భారత జాతీయ కాంగ్రెస్ కు అనుగుణంగా ఒక జాతీయ దృక్పథంతో వ్యవహరించేది. సత్యాగ్రహం శాంతియుత అహింస పద్ధతుల ద్వారా నిజాంపై ఒత్తిడి పెట్టేందుకు రాజకీయ వ్యూహాన్ని అనుసరించింది హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్రానికి వెలుపల కాకినాడ, బొంబాయి, పూనే, అకోలా వంటి ప్రదేశాల్లో తన సభలు నిర్వహించేది. 1938లో హరిపురాలో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన సభలో రాచరిక వ్యవస్థలో ఉన్న రాష్ట్రాలు సంస్థానాల ప్రజల పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీనితో ప్రేరణ పొందిన హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఒక సభ నిర్వహించేందుకు ప్రయత్నించగా నిజాం ఆ సభపై నిషేధం విధించాడు. ప్రముఖ కాంగ్రెస్ నాయకులు 1938 సత్యాగ్రహంలో పాల్గొన్నప్పటికీ చివరికి వెనక్కి తగ్గవలసి వచ్చింది. నిజాం పోలీసులు తమని గ్రామాల నుంచి బయటకి తరిమి కొట్టడంతో సరిహద్దు రాష్ట్రాలైన మరఠత్వాడ, కన్నడ, ఆంధ్ర ప్రాంతాల నుంచి మద్దతు కూడ కట్టేందుకు సరిహద్దు క్యాంపులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ లో కొంతమంది కార్యాచరణ కమిటీ ద్వారా తమని తాము సమీకరించుకొని సరిహద్దు క్యాంపుల నుంచి హైదరాబాద్ పై సాయుధ దాడులు జరిపారు.

రాజకీయ చైతన్యం కలిగిన కొంతమంది ఆర్య సమాజ్ ఉద్యమకర్తలు రాష్ట్ర కాంగ్రెస్ లో నాయకత్వ పాత్రలకు ఎదిగారు. స్వామి రామానంద తీర్థ కమ్యూనిస్టులతో ఒక పొత్తు ఏర్పరచుకోవడం ద్వారా నిజాం కి వ్యతిరేకంగా ఒక సమైక్య సంఘటన ఏర్పడేందుకు దోహదం చేశారు, అయితే కాంగ్రెస్ సంప్రదాయమైన రాజకీయ పద్ధతులు అనుసరించాలని భావించడంతో ఆయన ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు.

1946లో భారత స్వాతంత్ర సిద్ధి ఇక తప్పదని స్పష్టమైన దశలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్ లో విలీనం చేసి నిజాం పాలనని అంతం చేయాలంటూ ఒక ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. 1947 ఆగస్టు 15వ తేదీన రామానంద తీర్థ బహిరంగంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ ప్రదేశాల్లో నిజాంకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం సత్యాగ్రహం నిర్వహించింది.

iii. కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో రైతుల ఉద్యమం

తెలంగాణలో భూమిలేని పేదలు, సన్నకారు రైతుల హక్కుల రక్షణ కోసం, నిజాం కి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు భారీగా సాయుధ పోరాటం చేపట్టారు. అనేకమంది ప్రముఖ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రావి నారాయణ రెడ్డి, కామ్రేడ్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు మఖ్దుం మొహియుద్దీన్, సామ్యవాద నాయకుడు డి. వెంకటేశ్వర రావు మొదలైన వారు అనేకమంది ఈ పోరాటం పట్ల సంఘీభావంతో కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ ద్వారా పని చేస్తూ, గెరిల్లా పోరాట పద్ధతులు అనుసరించేవారు. 1946, సెప్టెంబర్ 11 వ తేదీన కమ్యూనిస్ట్ పార్టీ, దాని పతాక సంస్థలు నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరపాలని పిలుపునిచ్చాయి. కమ్యూనిస్ట్ శ్రేణుల్లో మహిళా విప్లవకారులు అనేకమంది ఉండేవారు. వారిలో చాకలి ఐలమ్మ ప్రముఖులు. వారు తరచూ నిజాం పోలీస్, రజాకార్లతో ఘర్షణ పడుతుండడంతో ఇరువైపులా భారీగా ప్రాణ నష్టం జరుగుతుండేది.

iv. విద్యార్థి మరియు యువజన ఉద్యమం

నిజాంపై పోరాటంలో యువజనులు, విద్యార్థులు, ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు భారీ ఎత్తున పాలుపంచుకున్నారు. విద్యార్థి ఉద్యమానికి రెడ్డి హాస్టల్ ప్రధాన కార్యాలయంగా మారింది. మహిళలు, జాతీయతావాదులైన ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ సత్యాగ్రహి అయినా శ్రీమతి దుర్గా బాయ్ దేశ్ ముఖ్ ఎన్నో సార్లు జైలు పాలయ్యారు కూడా. ప్రముఖ జాతీయతావాద పాత్రికేయుడు, ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయబుల్లా ఖాన్ ను నిజాంకు వ్యతిరేకంగా రచనలు చేసినందుకు రజాకార్లు హతమార్చారు.

v. గిరిజన తిరుగుబాటు

1930లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన గోండ్ నాయకుడు కొమరం భీమ్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విప్లవం చేశారు, గోండ్ లతో కలిసి కొమరం భీం నిజాంపై సుదీర్ఘ పోరాటం జరిపారు. జల్ జంగల్ జమీన్ అనే తన నినాదంతో గిరిజన హక్కుల పై దృష్టి కేంద్రీకరిస్తూ కొమరం భీమ్ నిజాంపై అత్యంత ఉత్తేజపూర్వకమైన పోరాటం జరిపారు అయితే నిజాం పోలీసులు కొమరం భీమ్ ను 1940లో హతమార్చారు.

vi. రాజకీయ ఉద్యమానికి నిజాం స్పందన

1920 దశకంలో ఖిలాఫత్ ఉద్యమం హిందూ నాయకులు ముస్లిం మేధావులను సన్నిహితం చేసింది. దీనితో అలజడి చెందిన నిజాం హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు విశ్వ ప్రయత్నం చేయడంతో పాటు 1927లో యార్ బహదూర్ జంగ్ సృష్టించిన మజిలీస్ ఏ ఇత్తహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థకు తోడ్పాటు అందించాడు. మత మార్పిడి ప్రధాన లక్ష్యంగా పనిచేసే తబ్లిగ్ మంత్రిత్వ శాఖలో యార్ బహదూర్ జంగ్ ఒక మంత్రి. తీవ్రవాద ముస్లిం సంస్థ అయిన మజ్లీస్ సంస్థ హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలనను మరింతగా ప్రోత్సహించి ముస్లిం ఆధిపత్యాన్ని కొనసాగించడం కొరకు చర్యలు చేపట్టింది. ఆర్య సమాజ్ కార్యకర్తలను జాతీయతవాద ఉద్యమాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడంతో పాటు హిందువులను ఇస్లాంకి మతమార్పిడి చేసేందుకు భారీగా మతమార్పిడి కార్యక్రమాలు చేపట్టింది. అతి కొద్ది కాలంలో 20వేల మంది హిందువులను మార్చడంతో హిందూ సమాజంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఇది ఇలా ఉండగా ఇత్తెహాద్ నాయకత్వాన్ని ఉత్తర భారతదేశానికి చెందిన పాకిస్తాన్ అనుకూలమైన ఉద్యమకర్త న్యాయవాది ఖాసీం రిజ్వీకి అప్పగించారు. ఖాసీం రిజ్వీ లక్షన్నర మంది సాయుధ స్వచ్ఛంద పోరాటవాదులతో రజాకార్ల పేరిట ఒక దళాన్ని సిద్ధం చేశాడు. నిజాం పోలీసులతో కలిసి ఈ రజాకార్లు హిందువులను జాతీయత ముస్లింలను రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడం, అవసరమైతే వారిని హత్యచేయడం వంటి పనులు నిర్వహించారు.

హిందువుల్లో పెరుగుతున్న నిరసన, స్వతంత్ర భారత దేశంలో విలీనం కావాలన్న ఒత్తిడి పెరగడంతో నిజాం క్రమంగా రజాకార్లపై ఆధారపడ్డాడు. దీనితో రిజ్వీ రజాకార్లకు నాయకుడయ్యాడు.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం