వీడియోను దాటవేయి

అసఫ్ జాహీ రాజవంశం (నిజాములు)

1687 లో ఔరంగజేబు సైన్యం దాడి చేసి, హైదరాబాద్ ని, గోల్కొండ కోటను ధ్వంసం చేయడంతో కుతుబ్ షాహీ వంశం అంతమైంది. మొఘల్ సామ్రాజ్యానికి అనుబంధంగా దక్కన్ గోల్కొండ మొఘల్ సుబాగా మారిపోయాయి. ముబారీజ్ ఖాన్ అనే వ్యక్తిని సుబేదార్ గా నియమించారు. ముఘల్ చక్రవర్తి ప్రతినిధిగా దక్కన్ లో అతను వ్యవహరించేవాడు. 1707లో ఔరంగజేబు మరణంతో మొఘల్ సామ్రాజ్యం అసమర్థ పాలకుల చేతిలో పడింది. ఆస్థానంలో ఉన్న శక్తివంతులైన నవాబుల అధీనంలో వారు ఉండేవారు.రాజ్యంలో జరుగుతున్న కుట్రలతో విసుగెత్తిన మీరు ఖమ్రుద్దీన్ అనే మొఘల్ సర్దార్, ఢిల్లీ దర్బార్ విడిచి తన సైనిక దళంతో దక్షిణాదికి ప్రయాణమయ్యాడు. 1723లో బేరార్ లో శేఖర్ ఖేదా యుద్ధంలో దక్కన్ సుబేదార్ ముబారిజ్ ఖాన్ ని ఓడించి తనని తాను నిజాం ఉల్ ముల్క్ గా ప్రకటించుకున్నాడు. ఆ ప్రకారంగా దక్కన్ సుబా మొత్తంలో అసఫ్ జాహీ పాలన స్థాపన జరిగింది.

నిజాం పాలన నియంతృత్వ, నిరంకుశ, భూస్వామ్యవాద తీరును, స్వరూపాన్ని మొదటి అసఫ్ జాహీ పాలకుడే నిర్దేశించాడు. 1724 నుంచి 1748 వరకు పాలించిన మొదటి నిజాం క్రూరమైన, దురుసు ప్రవర్తన కలిగినవాడు అన్నది తెలిసిందే. ప్రత్యర్థుల పట్ల హింసాత్మకంగా స్పందించడం పరిపాటి కాగా, నవాబులు, రాజులు, సైనికాధిపతులతో కూడా ఎంతో కఠోరంగా, కర్కశంగా ఆయన ప్రవర్తించేవాడుట. కుతుబ్ షాహీలకు అనుబంధంగా, అనుయాయులుగా ఉన్న అనేకమంది జమీందార్లు, రాజాలను హతమార్చారు, పదవీచ్యుతులను, నిర్వాసితులను చేశారు. లేదా వారి మతం మార్చివేశారు. ఆంధ్రా ప్రాంతంలో నిజాం అనుచరుడైన రుస్తుం ఖాన్ కూడా తన హింస, కర్కశ వైఖరితో జమీందార్లను భయాందోళనలకు గురి చేశాడు. కులీనులు, సామాన్య ప్రజలను ఊచకోత కోసి, శిరచ్చేదనం చేసి, వారి తలకాయలతో రుస్తుం ఖాన్ ఖుల్లా మినార్ నిర్మించి ప్రజల్లో వొణుకు పుట్టించాడు.

ఉత్తర భారత దేశంలో ముస్లిం పాలనలో అటువంటి భీభత్స మారణకాండ సామాన్యమే అయినప్పటికీ, తుగ్లక్ దాడుల సమయంలో మినహా దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపుగా ఏనాడు ఇంతటి దారుణకాండ జరిగినట్లు తెలియరాలేదు. నిజాం పాలనలో బలవంతపు మత మార్పిడులు కూడా ముమ్మరంగా జరుగుతుండేవి. దారుణమైన, అమానుషమైన హింసాకాండతో ప్రారంభమైన నిజాం పాలన, చిట్టచివరికి ప్రజల తిరుగుబాటు, తీవ్ర ప్రతిఘటన, భారత ప్రభుత్వ జోక్యంతో అంతం కావడం అనేది ఆసక్తికరమైన విషయం.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం