వీడియోను దాటవేయి

నిజాం పాలన యొక్క స్వభావం

నిజాంల పాలన బూర్జువా, నిరంకుశపాలనగా ఉండేది. మొత్తం భూమిలో నలభై శాతం జాగీర్ దారీ వ్యవస్థలో భాగంగా ఉండేది. నిజాం, ఆయన బంధువులు, సర్ఫ్ ఏ ఖాస్, పైగాల పేరిట పెద్ద విస్తీర్ణం భూములకు యజమానులుగా ఉండేవారు. పది శాతం భూమి నిజాం పేరు మీదే ఉండేది. మిగిలిన భూమి దివాని భూమి పేరిట ప్రభుత్వం అధీనంలో ఉండేది. గ్రామీణ అర్థ వ్యవస్థలో భూస్వామ్యుల పెత్తనం ఉండేది. రాయత్వారీ వ్యవస్థ అమలులో ఉన్నప్పటికీ, రైతులను కేవలం కౌలుదారులుగా మార్చి, వారికి భారీగా పన్నులు విధించేవారు. ఈ దోపిడీతో ప్రజలు ఆర్థికంగా దెబ్బతిని కుంగిపోయేవారు. హైదరాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తాండవించేది. నిజాం దోపిడీ తట్టుకోలేక, గిరిజనులు తిరుబాటు చేశారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసింది 1853, 1860 మధ్య తిరుగుబాటు చేసిన రాంజి గోండ్. మరో పక్క, మరిన్ని పన్నులు చెల్లించాలని నిజాముల పై బ్రిటిష్ వారు ఒత్తిడి తెచ్చేవారు. ఆదాయంలో వచ్చిన లోటు పూడ్చేందుకు నిజాము విచక్షణారహితంగా అప్పులు చేయడంతో పెద్ద ఆర్ధిక సంక్షోభం నెలకొంది.

1853లో తొలి ప్రధానమంత్రిగా నియమితుడైన మొదటి సాలార్ జంగ్ పాలనా యంత్రాంగం, ఆర్ధిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉన్న హైదరాబాద్ లో అనేక పరిపాలనా, రెవిన్యూ, న్యాయ సంస్కరణలను ప్రవేశపెట్టాడు. బాలికల పాఠశాలలతో సహా రాష్ట్రమంతటా ఆయన స్కూళ్ళు, ఉర్దూ మాధ్యమంలో ఒక ఇంజనీరింగ్ కళాశాల కూడా స్థాపించారు. అయితే, ఈ చర్యలవల్ల తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడే అనేక మందికి ఆధునిక విద్య అందుబాటులోకి రాలేదు. ఆయన ఆ పైన పోస్టల్, టెలిగ్రాఫ్ సేవలు కూడా ప్రారంభించి, రైలు మార్గాల నిర్మాణం కోసం బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే క్షీణించి, దిగజారి ఉన్న హైదరాబాద్ ని ఒక ఆధునిక రాష్ట్రంగా మార్చేందుకు ఆయన చేపట్టిన సంస్కరణలు పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదు. విద్య, ఆరోగ్యం, పరిపాలనలో వచ్చిన సంస్కరణల ఫలితాలు జనాభాలో అధిక శాతానికి అందకపోవడంతో హైదరాబాద్ అదే పాత, మధ్యయుగ రాజ్యంగా మిగిలిపోయింది.

ఆరవ అసఫ్ జా నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 1884 లో సింహాసనాన్ని అధిరోహించి లాయాక్ అలీ సాలార్జంగ్ IIని ప్రధానమంత్రిగా నియమించాడు. ఆయన పర్షియన్ భాష స్థానంలో ఉర్దూను హైదరాబాద్ రాష్ట్ర ఏకైక అధికారిక భాషగా ప్రవేశపెట్టారు. అయితే అప్పటికే ఒకటవ సాలార్జంగ్ అమల్లోకి తెచ్చిన సంస్కరణలతో, ముఖ్యంగా అతని పరిపాలనా, రెవిన్యూ సంస్కరణలతో విసుగెత్తిన ముస్లిం, హిందూ ఉన్నత వంశీయులకు అసౌకర్యాన్ని కలిగించింది. అధికార భాషగా ఉర్దూ అమల్లోకి రావడంతో ఉత్తర భారత ముస్లింలు హైదరాబాద్లోకి పెద్ద ఎత్తున తరలివచ్చారు, పాశ్చాత్య విద్య అభ్యసించిన ఆ ముస్లింలు, ఆంగ్లం, ఉర్దూ రెండింటిపై పట్టు ఉన్న కారణంగా రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థల్లో కీలక స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత, పాఠశాలల్లో కూడా ఉర్దూని ఏకైక బోధనా మాధ్యమంగా మార్చడంతో తెలుగు, మరాఠీ, కన్నడ, ఇతర స్థానిక భాషలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.

నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు పెద్ద కుటుంబం, పరివారం ఉండేవి. వారు ఆ ప్రాంతం మొత్తంలో వందలాది అద్భుతమైన రాజభవనాలు, కోఠీ లను ఆక్రమించుకున్నారు. 1937లో నిజాం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తి అని టైం పత్రిక ప్రకటించింది. ఆయన ప్రజలు మాత్రం పేదరికంలో కొట్టుమిట్టాడేవారు.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం