వీడియోను దాటవేయి

రజాకార్లు మరియు నిజాం పోలీసుల దురాగతాలు

ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీపై హైదరాబాదులో నిషేధం విధించి పార్టీ నాయకులను జైల్లో పడేశారు అంతకంటే ఇంకా ప్రమాదకరంగా నిజాం భారత్ కి తెలియకుండా పాకిస్తాన్ కు రెండు వందల మిలియన్ రూపాయల రుణాన్ని ఇచ్చాడు. 42 వేల మంది సైనికులతో కూడుకున్న తన సైన్యాన్ని పెంచేందుకు విమానం ద్వారా ఆయుధాలను హైదరాబాదులోకి స్మగ్లింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు ప్రారంభించాడు. సిడ్ని కాటన్ అనే ఆస్ట్రేలియా జాతీయుడి సహాయంతో ఈ ఆయుధాల స్మగ్లింగ్ తోపాటు, పోర్చుగల్ నుంచి కూడా గోవా ద్వారా ఆయుధాలు తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు.

ప్రజల అణచివేత, మత హింస తీవ్రంగా జరుగుతూనే ఉన్నాయి. కాసిం రిజ్వి నేతృత్వంలోని గుండాలైన రజాకార్లు ఎటువంటి అడ్డు అదుపు లేకుండా ఈ దారుణమైన, అమానుషమైన హింసాకాండ కొనసాగించేందుకు అనుమతి అదేవిధంగా కొనసాగింది. ఈ సమయంలో నిజాంకి ఆర్య సమాజ్ నుంచి హిందూ మహాసభ నుంచి రెండు విధాలుగా ప్రతిఘటన ఎదురైంది. హిందువుల హక్కుల కోసం పోరాడుతున్న ఆర్య సమాజ్, హిందూ మహాసభ, మరోపక్క రైతాంగం హక్కుల కోసం పోరాడుతున్న గ్రామీణ తెలంగాణలోని కమ్యూనిస్టుల నుంచి నిజాంకి ప్రతిఘటన ఎదురైంది. ఈ ప్రతిఘటన అతి తీవ్రమైన స్థాయిలో ఉండడంతో రజాకార్లు వారిపై ఒక దారుణమైన ఉగ్రదాడిని చేపట్టారు. గ్రామ గ్రామాల్లో తిరిగి వారు అనేక మంది హిందువులను ఊచకోత కోయడం, మహిళలపై అత్యాచారం చేయడం అపహరణలు జరపడం మొదలైనవి చేసారు. ఈ కాలంలో రజాకార్లు మరియు నిజాం పోలీసులు రెండు వేల మందిని హతమార్చారు అనేక వందల మంది మహిళలపై అత్యాచారాలు చేశారు.

తెలంగాణలోని వీర బైరాన్ పల్లి గ్రామంలో అత్యంత హేయమైన ఊచకోత జరిగింది. 1948 జూన్ నుంచి రజాకార్లు గ్రామంలోకి ప్రవేశించేందుకు మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ గ్రామస్తులు అనేక సాంప్రదాయమైన ఆయుధాలతో వారి ప్రయత్నాలను తిప్పి కొట్టారు. అయితే ఆగస్టులో హైదరాబాద్ స్టేట్ పోలీసుల సహాయంతో రజాకార్లు గ్రామస్తుల ప్రతిఘటనను పటాపంచలు చేసి గ్రామంపై దాడి చేశారు. అప్పటికీ గ్రామస్తులు గడి లోపల దాక్కుని కొంతమంది రజాకార్లను హతమార్చగలిగారు. అయితే గ్రామస్తులపైన భారీ సంఖ్యలో దాడి చేసిన రజాకార్లు వారిని చంపివేసి అనంతరం మహిళలపై అత్యాచారాలు చేస్తూ వారి బంగారు ఆభరణాలు దోచుకుని, దాదాపు 118 మంది గ్రామస్తులను తుపాకులతో కాల్చి చంపారు.

వరంగల్ జిల్లాలోని డోర్నకల్ మండలంలో పెరుమాండ్ల సంకీస గ్రామంలో 1948 సెప్టెంబర్ ఒకటో తేదీన 25 నుంచి 30 మంది రజాకార్లు గుర్రాలపై గ్రామంపై దాడి చేసి అనేక మందిని ఒక చోట చేర్చి, గ్రామస్తులను చిత్రవధలు పెట్టారు. గెరిల్లా పోరాటవాదుల ఆచూకీ కనుగొంటున్నారనే నెపంతో వారు గ్రామస్తులను హింసలు పెట్టి వారిని శివార్లకు తీసుకువెళ్లి ఒక వలయంలో వారిని నిలబెట్టి తుపాకులతో కాల్చి చంపారు. అనంతరం వారు గడ్డివాములకు నిప్పు పెట్టి గాయపడిన వారిని మంటల్లోకి విసిరి వేశారు. రజాకార్లను చూసి పారిపోయిన మహిళలు మొక్కజొన్న పొలాల్లో తలదాచుకుంటే రజాకార్లు వారిని వెంటాడి, వేటాడి పట్టుకుని, పట్టపగలు బాహాటంగా వారిపై అత్యాచారాలు చేశారు.

అప్పట్లో నిజాం పాలిత హైదరాబాద్ రాష్ట్రంలో భాగమైన కర్ణాటకలోని బీదర్ జిల్లా గోరాట గ్రామంలో రజాకార్ కమాండర్ శంషుద్దీన్, గ్రామం పైన దాడి చేశాడు. జాతీయ పతాకాన్ని అక్కడ ఆవిష్కరించినప్పుడు ఈ దాడి జరిగింది. ఈ దాడిని ప్రతిఘటించిన గ్రామస్తులు షంషుద్దీన్ ని చంపివేశారు. 1948 మే 9వ తేదీన అందుకు ప్రతీకారంగా రజాకార్లు దాడి చేసి గోరాట గ్రామంలో దాదాపు 200 మందిని ఊచకోత కోశారు.

వరంగల్ జిల్లా పరకాల లో ఎటువంటి సమావేశాలు జరపరాదని పోలీస్ నిషేధం విధించినప్పటికీ 1947 సెప్టెంబర్ రెండవ తేదీన సమీప గ్రామాల ప్రజలు 1500 మంది ఒకచోట గుమిగూడి భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులు, రజాకార్లు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 22 మంది మరణించారని 150 మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలియచేశారు. రజకార్లు ముగ్గురు వ్యక్తులను ఒక చెట్టుకి కట్టివేసి వారిని తుపాకీతో కాల్చి చంపారు. సమీపంలో ఉన్న లక్ష్మీపురం గ్రామంలో వారు మహిళలపై లైంగిక అత్యాచారాలు జరిపి, డబ్బు దోచుకుని, వారి గుడిసెలకు నిప్పు పెట్టారు.

చరిత్రకారులు ఇటువంటి వందలాది దారుణాలను దాడులను చరిత్రలో నమోదు చేశారు. భారత సైన్యం 1948లో ఆపరేషన్ పోలో ద్వారా నిర్వీర్యం చేసేంతవరకు రజాకార్లు తమ అమానుషమైన పాశవికమైన దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం