వీడియోను దాటవేయి

హైదరాబాద్ సంక్షోభం

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నిజాం తన అధికారాన్ని, సంపదను, తన వైభవోపేతమైన వ్యవస్థను విడిచిపెట్టరాదని నిర్ణయించుకున్నాడు. భారత్ లో కానీ పాకిస్థాన్లో కాని తాను చేరబోనని స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రానికి తానే పాలకుడిగా ఉండాలని ఇంకా అవసరమైతే బ్రిటన్ కి లొంగి ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ అసాధ్యమైన అనూహ్యమైన కలను సాకారం చేసుకునేందుకు నిజాం చేయని ప్రయత్నం లేదు.

1947 జూలైలో నవాబ్ చట్టారీ, నవాబ్ అలీ యావర్ జంగ్ మరియు సర్ వాల్టర్ మోంక్టన్ లతో కూడిన ఒక ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. హైదరాబాద్ పాలకుడు ఒక స్టాండ్ స్టిల్ ఒప్పందం పైన సంతకం చేస్తాడని, భారత్ లో విలీనం అయ్యేందుకు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ పత్రం పైన సంతకం చేయబోడని ఈ ప్రతినిధి బృందం తెలియచేసింది. ఈ షరతుకి ప్రభుత్వం అంగీకరించకపోతే మహారాజశ్రీ నిజాము గారు పాకిస్తాన్ తో విలీనం అయ్యే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారని ప్రతినిధి బృందం చెప్పింది. బేరార్ ప్రాంతాన్ని నిజాంకి తిరిగి ఇవ్వాలని, వెంటనే ఆయుధాలు మందుగుండు సామాగ్రి తమకు సరఫరా చేయాలని అలా ఇవ్వని పక్షంలో అవి దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కూడా నిజాం తరఫున ప్రతినిధి బృందం షరతులు విధించింది. నిజాం మనసులో ఉన్న దురుద్దేశ్యాలను గ్రహించని లార్డ్ మౌంట్ బాటన్ ఆగస్టు 14 తుది గడువును రెండు నెలల పాటు పొడిగించి హైదరాబాద్ పాలకుడికి తాను అనుసరించే వైఖరి విషయంలో ఆలోచించుకునే గడువు ఇవ్వాలని సర్దార్ పటేల్ ని కోరారు.

దీనితో ధైర్యం పుంజుకున్న నిజాం ఇప్పుడు హైదరాద్ ని ఒక స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించాలని, రైల్వే, తపాలా, టెలిగ్రాఫ్ మరియు సైన్యం విషయంలో మాత్రమే భారత్ తో తమ రాష్ట్రం విలీనం అవుతుందని డిమాండ్ చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ ఇతర దేశాలకు తన సొంత రాయబారులను నియమిస్తుందని భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం వచ్చిన పక్షంలో హైదరాబాద్ నిష్పక్షంగా ఉంటుందని కూడా నిజాం చెప్పాడు. భారత్ కామన్వెల్త్ నుంచి వేరుపడితే హైదరాబాద్ పూర్తి స్వతంత్రం కోరుకుంటుందని నిజాం ప్రకటించడం కొసమెరుపు.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం