1947 జూన్ లో ఒక రాష్ట్రాల శాఖను ఏర్పాటు చేసి అంతకు ముందున్న రాజకీయ విభాగాన్ని రద్దు చేశారు. కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ శాఖకు ఇంచార్జ్ కాగా విపి మీనన్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అన్ని సంస్థానాలను భారత్ లో విలీనం చేసే ప్రాథమిక బాధ్యత ఈ విభాగానికి అప్పచెప్పారు. వైవిధ్యంతో కూడుకున్న ఈ సంస్థానాలు, రాష్ట్రాలను అర్థవంతమైన విధంగా విలీనం చేయడం అనేది అసాధ్యంగా కనిపించింది. పొంతన లేని రంగులు, నమూనాలు, ఆకృతులతో కూడుకున్న ఈ సంస్థానాలను ఒకే విధమైన కలనేతలోకి తీసుకురావడం దాదాపు అసాధ్యంగా కనిపించింది.
మొత్తం 565 సంస్థానాల్లో 327 సంస్థానాలకు కేవలం 20 చదరపు మైళ్ల విస్తీర్ణం 3000 జనాభా 22 వేల రూపాయల వార్షిక ఆదాయం మాత్రం ఉండేది.
'ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్' పేరిట ఒక ప్రత్యేకంగా రూపొందించిన ఒప్పందం ముసాయిదాను అన్ని సంస్థానాలకు పంపారు. ఈ రాష్ట్రాల్లో అత్యధికులు వెంటనే ఒప్పందంపై సంతకాలు చేసినప్పటికీ, కొన్ని సంస్థానాలు మాత్రం ధిక్కారంతో తాము సంతకం చేయబోమని నిరాకరించాయి. బరోడా, భోపాల్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, జోధ్ పూర్, జునాగఢ్, మణిపూర్, ట్రావెన్ కోర్ - కొచ్చిన్ ఈ సంస్థానాల్లో ఉన్నాయి. భారత స్వాతంత్రం త్వరలో సిద్ధిస్తుందన్న భావనతో జాతి నిర్మాణంలో ప్రతి స్థాయిలోనూ సంస్థానాలను కలుపుకోవడంతో సహా వివిధ రకాల కొత్త సమీకరణాల గురించి ఆలోచించవలసి వచ్చింది.